లక్నో: అత్తతో గొడవ జరుగడంతో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Poisons Children and Dies) ఆ మహిళతోపాటు బాలుడు మరణించగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్యాంగ్చౌలి గ్రామానికి చెందిన సరళా దేవి ఆదివారం ఉదయం తన పిల్లలను తిట్టింది. దీంతో అత్త జోక్యం చేసుకోవడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సరళ తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చింది. ఆ తర్వాత గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాగా, ఈ విషయం తెలిసిన సరళ భర్త, గ్రామస్తులు వెంటనే పిల్లలను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు రిఫర్ చేయడంతో కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరేళ్ల కుమారుడు ఆదర్శ్ మరణించాడు. పదేళ్ల కుమార్తె అన్షిక పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సరళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.