ముంబై: సరదా కోసం చేసిన పని ఒక యువకుడి ఉసురు తీసింది. మలద్వారంలోకి ఎయిర్ కంప్రెసర్ (air compressor) గొట్టాన్ని చొప్పించడంతో అతడు మరణించాడు. మహరాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. హదస్పర్ పారిశ్రామిక ప్రాంతంలో పలు రకాల పిండి తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కొందరు యువకులు పని చేస్తున్నారు. ఆ యూనిట్లో దుమ్ము శుభ్రం చేసేందుకు ఎయిర్ కంప్రెసర్‌ను వినియోగిస్తారు.
కాగా, డిసెంబర్ 4న, 21 ఏళ్ల ధీరజ్ గోపాల్‌సింగ్ గౌడ్, 16 ఏళ్ల మోతీలాల్‌ను ఆటపట్టించాడు. సరదా కోసం ఎయిర్ కంప్రెసర్ గొట్టాన్ని అతడి మలద్వారంలోకి చొప్పించాడు. ఒత్తిడితో గాలి యువకుడి శరీరంలోకి ప్రవేశించింది. దీంతో అతడి కడుపు ఉబ్బడంతో పాటు అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. అస్వస్థతకు గురైన మోతీలాల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతడి మృతికి కారణమైన నిందితుడు ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.