న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మారిటైమ్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ నౌక నుస్రత్ సిబ్బంది తీసుకెళ్లిపోతున్న ఏడుగురు భారతీయ మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) సాహసోపేతంగా కాపాడింది. ఐసీజీ తెలిపిన వివరాల ప్రకారం, ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక అగ్రిమ్ ఆదివారం గస్తీ తిరుగుతున్నది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో ఓ భారతీయ చేపల పడవ నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చింది. పాకిస్థానీ నౌక నుస్రత్ భారతీయ చేపల పడవ కాల భైరవ్‌ను స్వాధీనం చేసుకుని, దానిలోని ఏడుగురు మత్స్యకారులను తీసుకెళ్లిపోతున్నట్లు ఆ కాలర్ చెప్పారు. దీంతో పాకిస్థానీ నౌకను అగ్రిమ్ నౌక వెంటాడి, అడ్డుకుని, దానిలోని భారతీయులందరినీ విడిపించింది. అయితే, కాల భైరవ్ దెబ్బతిని, మునిగిపోయింది. అగ్రిమ్ నౌక సోమవారం తిరిగి ఓఖా
హార్బర్‌కు వచ్చింది.