తిరుచ్చి, ఏప్రిల్ 5: కన్నతల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు. అందుకే అనుకోని కారణాలతో చిన్నతనంలోనే తల్లికి దూరమై.. ఖండాలు దాటి వెళ్లిన ఓ కుమారుడు 30 ఏండ్ల తర్వాత తల్లిని వెతుక్కుంటూ భారత్కు వచ్చాడు. ఆ యువకుడి పేరు థామస్ కుమార్ జాన్సన్. భారత సంతతికి చెందిన అమెరికన్ జాతీయుడు. రెండేండ్ల వయసులో అతడిని తమిళనాడులోని తిరుచ్చికి చెందిన సాంఘిక సంక్షేమ సంస్థ అమెరికాకు చెందిన ఓ కుటుంబానికి దత్తత ఇచ్చింది. తనకు జన్మనిచ్చిన తల్లిని కలవడమే ప్రస్తుతం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు జాన్సన్. ఇందుకోసం చికాగోలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని మరీ తన దత్తత పత్రాల్లో తల్లి ‘మేరీ’, తండ్రి ‘సూసాయి’గా ఉన్న పేర్ల ఆధారంగా తల్లిదండ్రుల కోసం తిరుచ్చిలో వెతుకులాట ప్రారంభించాడు. ‘నేను బతికే ఉన్నానని, బాగున్నానని నా తల్లికి తెలియాలి. తాను ఎక్కడి నుంచి వచ్చాను.. తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకుంటే తానొక పరిపూర్ణ వ్యక్తిని అవుతా’నని థామస్ భావోద్వేగంతో అన్నారు.