రాయ్‌పూర్/జంజ్‌గిర్, జూన్ 15: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డ 11 ఏండ్ల బాలుడు 104 గంటల తర్వాత మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. మానసిక స్థితి సరిగా లేకపోయినా, భయానక పరిస్థితుల్లో ఏకంగా నాలుగు రోజులకు పైగా ‘డెత్ హోల్’లో చిక్కుకున్న ఆ బాలుడు చూపిన ధైర్యం, 500 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది అవిశ్రాంతంగా చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ఫలించింది. సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం బయటకు తీసిన బాలుడ్ని గ్రీన్ చానల్ ద్వారా దవాఖానకు తరలించారు. ప్రసుత్తం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రాహుల్ సాహూ అనే బాలుడు ఈనెల 10న తేదీన తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో 80 అడుగుల బోరుబావిలో పడ్డాడు. 60 అడుగుల వద్ద చిక్కుకుపోయాడు.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పైపు ద్వారా ఆక్సిజన్, తాడు ద్వారా బాలుడికి జ్యూస్, పండ్లు వంటివి పంపించారు. బోరుబావికి సమాంతరంగా 60 అడుగుల గొయ్యి తవ్వి, రాహుల్‌ను చేరేందుకు టన్నెల్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నాలుగు రోజుల పాటు శ్రమించిన సిబ్బంది, స్థానికులు మంగళవారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో బాలుడ్ని క్షేమంగా బయటకు తీసి దవాఖానకు తరలించారు.