కోల్‌కతా, మే 12: తాను పేదవాడినని, అదానీ తనకు డబ్బులు ఇస్తే పార్లమెంటులో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడబోనని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కాంగ్రెస్ నేతలకు టెంపోల్లో డబ్బు వచ్చిందని మోదీ ఆరోపిస్తున్నారు, ఆ డబ్బు ఎక్కడ పెట్టారు ? అని విలేఖరి ప్రశ్నించగా.. ‘డబ్బులు ఎక్కడ ఉన్నాయి.
నేను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాను. నాకు చాలా డబ్బులు కావాలి. నేను పేదవాడినని, ఎన్నికల్లో పోటీకి నా దగ్గర డబ్బులు లేవని నేను బహిరంగంగా చెప్తున్నా. ఈ రోజుల్లో డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం చాలా కష్టంగా మారింది. నాకు టెంపోలో అవసరం లేదు. అదానీ ఒక బ్యాగులో డబ్బులు పంపించినా నాకు సరిపోతాయి.’ అని అధిర్ జవాబు ఇచ్చారు.
‘మీరు పార్లమెంటులో వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా ?’ అని విలేఖరి ప్రశ్నించగా.. ‘అవును, వాళ్లు మాకు డబ్బులు పంపించరు కాబట్టే మాట్లాడతా. వాళ్లు పంపిస్తే సైలెంట్ అవుతా.’ అని చెప్పారు. ‘అంటే, మీకు డబ్బులు అందితే సైలెంట్ అవుతారని చెప్తున్నారా ?’ అని విలేఖరి మళ్లీ ప్రశ్నించగా.. ‘ముందు వాళ్లు పంపనివ్వండి’ అని అధిర్ జవాబిచ్చారు.
ఇదీ కాంగ్రెస్ మామూళ్ల వసూళ్ల పద్ధతి: బీజేపీ
అధిర్ రంజన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మామూళ్ల వసూలు పద్ధతిని అధిర్ బహిర్గతం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. డబ్బు సంచులు అందితే పార్లమెంటులో ఎలాంటి అంశంపైనైనా మాట్లాడకుండా ఉంటామని అధిర్ రంజన్ బాహాటంగా చెప్తున్నారని, డబ్బులు అందకపోతే గలాటా సృష్టిస్తారని పేర్కొన్నారు.
అంబానీ, అదానీ గురించి రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడటం లేదని అన్నారు. ఇలాంటి పనులు చేసే యూపీఏ హయాంలో కాంగ్రెస్ రూ.12 లక్షల కోట్లు సంపాదించిందన్నారు. ఐఎన్‌సీ అంటే ‘ఐ నీడ్ కరప్షన్’ అని అభివర్ణించారు. అంబానీ, అదానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడకపోవడాన్ని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ, టెంపోల నిండా రాహుల్‌గాంధీకి డబ్బులు అందాయని ఆరోపించారు.