Ranya Rao : కన్నడ నటి (Kannada actress) రన్యారావు (Ranya Rao) దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తనతోపాటు నిందితుడిగా ఉన్న తరుణ్రాజ్కు ఆమె ఆర్థికసాయం చేసినట్లు తెలిసింది. డీఆర్ఐ అధికారుల (DRI officers) విచారణలో ఈ విషయం వెల్లడైంది. తరుణ్రాజ్ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానంలో డీఆర్ఐ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.
రన్యారావు పంపించిన డబ్బులతోనే నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని అధికారులు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా నిందితులు బ్యాంకాక్, జెనీవాకు కూడా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని పేర్కొన్నారు. తరుణ్రాజ్ దుబాయ్ వెళ్లినరోజే తిరిగి వచ్చేవాడని ఆరోపించారు. ఇటీవల దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కన్నడ నటి రన్యారావు పట్టుబడ్డారు.
మార్చి 3న అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న హోటల్ వ్యాపారి తరుణ్రాజ్, రన్యారావు స్నేహితులని అధికారులు తెలిపారు. వీరిద్దరూ 2023లో దుబాయ్లో విరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ (LLC) అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారని, నాటి నుంచి వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతున్నారని విచారణలో తేలింది. తన కుటుంబానికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి రన్యారావు తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించినట్లు అధికారులు తెలిపారు.
నిందితులు ఇద్దరికీ బ్యాంకాక్, జెనీవాలోని ప్రముఖ బంగారం వ్యాపారులతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు కోర్టుకు తెలిపారు. ఆ వ్యాపారుల నుంచి వీరు బంగారం కడ్డీలను కొనుగోలు చేసి.. దుబాయ్ ఖాతాల ద్వారా విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లించేవారని గుర్తించినట్లు అధికారులు చెప్పారు.