Actor Dileep : శబరిమల అయ్యప్ప క్షేత్రంలో నటుడికి వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. ట్రావెన్కోర్ బోర్డుపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మలయాళ నటుడు దిలీప్ గురువారం శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. ఈ కారణంగా కొందరు భక్తులు దేవుడిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా కేరళ హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుంది. చాలా సమయం నటుడు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతించారని టీడీబీని ప్రశ్నించింది. నటుడివల్ల పిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సి వచ్చిందని మండిపడింది. దేవస్థాన యాజమాన్యమే ఇలా చేస్తే భక్తులు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించింది.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాలని, ఇతరులకు ప్రత్యేక దర్శనం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు ట్రావెన్కోర్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి శనివారం లోగా వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.