న్యూఢిల్లీ, జూలై 15: మణిపూర్‌లో హింసాకాండపై మౌనం వహిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రత్యేక పాలనకు అనుమతులు ఇవ్వాలంటూ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు మణిపూర్ అల్లర్ల మాటున రాష్ట్రంలోని చర్చిలను కూల్చుతున్నారని మిజోరం బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్ వనరామ్చుంగ ఆరోపించారు. చర్చిల కూల్చివేతకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. చర్చిల కూల్చివేత, క్రైస్తవులపై దాడులకు సహకరిస్తున్న బీజేపీ తీరుకు నిరసనగా తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన శనివారం వెల్లడించారు.
ఈ మేరకు మిజోరం బీజేపీ చీఫ్‌కు లేఖ రాశారు. ఇప్పటివరకు మణిపూర్‌లో 357 చర్చిలు, పాస్టర్ల ఇండ్లు, కార్యాలయాలు బూడిదయ్యాయని పేర్కొన్నారు. ‘మణిపూర్‌లో వందల చర్చిలు నేలమట్టమయ్యాయి. క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. సీఎం బీరేన్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాడులను ఖండించలేదు. చర్చిల కూల్చివేతకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని నమ్ముతున్నా. క్రైస్తవ మతం, క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మిజోరం బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మణిపూర్ అంశంపై మౌనం వహిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కొక్కరు తమ గళాన్ని వినిపిస్తున్నారు. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తున్నది. ప్రత్యేక పరిపాలనకు అనుమతివ్వాలంటూ సొంత పార్టీ నేతలే బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.
మణిపూర్‌పై విదేశాలు స్పందిస్తున్నా.. ప్రధాని మోదీలో ఏమాత్రం చలనం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంట్ దీనిపై స్పందించి చర్చించినప్పటికీ మోదీ మాత్రం ఒక్కమాట మాట్లాడటం లేదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాఫేల్ డీల్ కారణంగానే ప్రధాని మోదీకి బాస్టిల్ డే పరేడ్కి టిక్కెట్ (ఆహ్వానం) లభించిందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో శనివారం ఆయన ట్వీట్ చేశారు. అమెరికాలోని యేల్ యూనివర్సిటీ ప్రచురించిన నెల్సన్ వ్యాసం మాదిరిగా భారత్ చంద్రుడిపైకి చేరుకుంటున్నప్పటికీ భారతీయుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. భారతీయ వెర్షన్లో నెల్సన్ రాసిన వ్యాసాన్ని మూన్ అండ్ మణిపూర్‌గా చదువుకోవచ్చని వ్యంగ్యంగా పేర్కొన్నారు.