న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్స్ హోమ్‌లు రేప్, యాసిడ్ దాడి, లైంగిక హింస బాధితులకు ఉచిత వైద్య చికిత్సను నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. తండ్రి చేతిలో రేప్‌కు గురైన 16 ఏండ్ల బాలికకు వైద్యం అందించాలని కోర్టు చెప్పినా ఓ ప్రైవేట్ దవాఖాన ఆమెను వైద్యం కోసం నిరీక్షించేలా చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
లైంగిక వేధింపుల బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరించే వైద్యులు, వైద్య సిబ్బంది శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ‘ఉచిత వైద్యంలో ఎలాంటి పరీక్షలైనా చేయాల్సిందే. దీర్ఘ కాలంలో బాధితులకు అవసరాన్ని బట్టి శారీరక, మానసిక కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందే’ అని కోర్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దవాఖానలకు కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ‘లైంగిక దాడి, రేప్, గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి బాధితులకు ఇన్-పేషంట్, ఔట్ పేషంట్ వైద్య సేవలు ఉచితం’ అనే బోర్టును ప్రదర్శించాలని హాస్పిటల్స్‌ను కోరింది.