ఫరీదాబాద్: యూట్యూబర్, హిందీలో ప్రసారమైన బిగ్‌బాస్ (Big boss) ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గతవారం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లాయి. అయితే ఆ సమయంలో ఎల్విష్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. తాజాగా ఆ కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఇషాంత్ (Ishant) అలియాస్ ఇషు గాంధీగా (Ishu Gandhi) గుర్తించారు. ఫరీదాబాద్‌లోని (Faridabad) జవహర్‌నగర్ కాలనీకి చెందిన వాడని పేర్కొన్నారు.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన సమాచారం అందడంతో నిఘాపెట్టారు. శుక్రవారం ఉదయం నీరజ్ ఫరీద్ పురియా ముఠాను కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా వెంబడించారు. దీంతో పోలీసులపై ఆటోమేటిక్ పిస్టల్‌తో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు అతని కాలిపై గన్‌తో కాల్చడంతో గాయపడ్డాడు. అనంతరం అతడిని అరెస్టు చేసి దవాఖానకు తరలించారు.
ఆదివారం (ఆగస్టు 17) ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎల్విష్ యాదవ్ ఇంటిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థులపైకి దాదాపు రెండు డజన్ల తూటాలను పేల్చినప్పటికీ, ఎవరూ గాయపడలేదు. నిందితులు వెంటనే తప్పించుకుని పారిపోయారు. సంఘటన సమయంలో యాదవ్ ఇంట్లో లేరు. కేర్‌టేకర్ మాత్రమే ఆ ప్రాంగణంలో ఉన్నారు.