AC Helmets | చెన్నై: వేసవి కాలంలో శిరస్ర్తాణాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతం. మండుటెండల్లో విధులను నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కష్టాలను ఉన్నతాధికారులు గుర్తించారు. చెన్నైలోని అవడి సిటీ పోలీసులు ఎయిర్-కండిషన్డ్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ చల్లదనాన్ని, 10 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనాన్ని ఇవ్వగలవు. వీటిని ధరించినవారి మెడ క్రింది భాగం కన్నా తల భాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని ఇస్తాయి.
అందువల్ల తలనొప్పి, అలసట వంటివి తగ్గుతాయి. ఎయిర్ కండిషనింగ్‌ను ఆన్ చేసినపుడు కాస్త వైబ్రేషన్ వస్తుందని అవడి సిటీ పోలీస్ కమిషనర్ కే శంకర్ చెప్పారు. తమ పరిధిలో పని చేస్తున్న 334 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లలో 50 మందికి ఈ ఏసీ హెల్మెట్లను ఇచ్చామని తెలిపారు. వీటి పనితీరును విశ్లేషించిన తర్వాత మిగిలిన వారికి కూడా వీటిని ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు.