Monsoon | దేశవ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో దేశంలో 92 సెంటీమీటర్ల వర్షాపాతం (దీర్ఘకాలిక సగటులో 106శాతం) నమోదవుతుందని అంచనా వేసింది.
అయితే, ఏప్రిల్లో అంచనా వేసిన 91.3 సెంటీమీటర్లు (సగటులో105శాతం) వర్షాపాతం ఎక్కువ. దేశంలోని ఈశాన్య, వాయువ్య ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్లో మాత్రమే దేశంలోని సగటు కోటా 16.7 సెం.మీ కంటే కనీసం 8శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ, ఈ సారి ఈ నెల 24న కేరళకు చేరుకున్నాయి. 2009 తర్వాత తొలిసారిగా రుతుపవనాలు ముందుగానే చేరుకున్నాయి. ముంబయికి చాలా సంవత్సరాల తర్వాత రుతుపవనాలు 16 రోజుల ముందుగా రావడం విశేషం.
అలాగే, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ, ఉత్తర భారతం వైపు వేగంగా విస్తరిస్తాయని చెప్పలేమని.. కొద్దిగా మందగమనం ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వర్షాలు ఉన్నా వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీ సిద్ధంగా ఉండాలని సూచించింది.