న్యూఢిల్లీ: సుమారు 400 మంది ఇండిగో ప్రయాణికులు(IndiGo Passengers).. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో చిక్కుకున్నారు. దాదాపు 24 గంటల పాటు ఆ ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాశారు. తొలుత విమానాన్ని ఆలస్యంగా నడపనున్నట్లు చెప్పారని, ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని ప్రయాణికులు ఆరోపించారు. సుమారు 12 గంటల విరామం తర్వాత ఫ్లయిట్‌ను రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.
విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని, మీల్ వోచర్లు ఇవ్వలేదని, ఇండిగో ప్రతినిధి కూడా ఎవరు తమను పరామర్శించలేదన్నారు. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ, ముంబైకి వెళ్లే ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఆలస్యం గురించి ఇండిగో నుంచి ప్రకటన రాలేదని, చివరకు టర్కిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రకటన చేసినట్లు ప్రయాణికులు వెల్లడించారు.
ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో లాంజ్ సౌకర్యం కల్పిస్తామన్నారని, కానీ సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఆ లాంజ్ సరిపోలేదన్నారు. ఇండిగో సంస్థ కస్టమర్ సర్వీసు ఏమాత్రం బాగా లేదని ఓ ప్రయాణికుడు తెలిపాడు.