MSMEs| న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు(ఎంస్ఎంఈ) బీజేపీ పాలనలో కుదేలవుతున్నాయి. దేశంలో గత మూడేండ్ల వ్యవధిలో ఏకంగా 20 వేల ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2020 జూలై నుంచి 2023 మార్చి మధ్య దేశంలో 19,687 ఎంఎస్ఎంఈలు మూతపడ్డట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. గత ఏడాదిలోనే 13,290 పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఉపాధి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు తెగనమ్ముతున్నది. ‘నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం నుంచి ఎంఎస్ఎంఈలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం నుంచి కూడా తగిన సహకారం లభించలేదు. అందుకే ఎంఎస్ఎంఈలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం తగిన సహకారం అందించి ఉంటే యువతకు ఉపాధి లభించడంతోపాటు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేది’ అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.