లక్నో : పంజాబ్‌లో ఆప్ ఘనవిజయంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. యూపీలోని ఘజియాబాద్‌లో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ నివాసం వెలుపల ఢిల్లీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో గుమికూడిన ఆప్ కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్..కేజ్రీవాల్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు.
పంజాబ్‌లో ఆప్ విజయంతో స్వీట్లు పంచుకున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం పంజాబ్‌లో ఆప్ భారీ ఆధిక్యత సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విస్పష్ట మెజారిటీని సాధించింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన కుమార విశ్వాస్ 2018లో పార్టీ నుంచి బయటకు వచ్చారు.
అరవింద్ కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కుమార్ విశ్వాస్‌కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఇక పంజాబ్‌లో ఆప్ 91 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ 19 స్ధానాల్లో శిరోమణి అకాలీదళ్ 4 స్ధానాల్లో, బీజేపీ రెండు స్ధానాల్లో ఇతరులు 1 స్ధానంలో ఆధిక్యంలో ఉన్నారు.