న్యూఢిల్లీ, డిసెంబర్ 15: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 38 మంది అభ్యర్థులతో ఆదివారం తుది జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా ముఖ్యమంత్రి అతిశీ గతంలో పోటీ చేసిన కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఎక్స్ ద్వారా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, పూర్తి సన్నద్ధతతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీకి అవే కొరవడ్డాయని ఆయన విమర్శించారు.