న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా డేటింగ్ వార్తలు గుప్పుమన్న క్రమంలో త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ఆప్ ఎంపీ (AAP) ధ్రువీకరించారు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఇటీవల డిన్నర్, లంచ్ మీటింగ్‌లతో బిజీగా గడుపుతుండటంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాల వివాహం త్వరలో జరుగుతుందని ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ట్వీట్ చేశారు.
వీరిద్దరి రోకా వేడుక జరిగిందని, కాబోయే దంపతులు ప్రేమ, సంతోషం, సాన్నిహిత్యంతో మెలగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆప్ ఎంపీ ట్వీట్ చేశారు. సంజీవ్ అరోరా ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలకు వారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేశారు.
ప్రేమ జంటకు త్వరలోనే పెండ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కొద్దిమంది స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరిపించాలని వారు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కాగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. వారిద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో కలిసి చదువుకున్నారు.
Read More