తర్న్ తరన్: 12 ఏళ్ల క్రితం దళిత యువతిని వేధించిన కేసులో.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ లాల్పురా(MLA Manjinder Singh)తో పాటు మరో ఏడు మందిని దోషులుగా తేల్చి, వాళ్లను అరెస్టు చేశారు. తర్న్ తరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పట్టి సబ్ జైలుకు ఎమ్మెల్యేతో పాటు ఇతరులను తీసుకెళ్లారు. అదనపు సెషన్స్ జడ్జీ ప్రేమ్ కుమార్ ఈ కేసులో తీర్పును ఇచ్చారు. ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ గతంలో ఆటో డ్రైవర్గా చేశారు. 2013, మార్చి 3వ తేదీన 19 ఏళ్ల ఎస్సీ మహిళపై దాడి జరిగింది. వేధింపులకు పాల్పడిన వారిలో ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ కూడా ఉన్నాడు. అయితే ఈ కేసులో సెప్టెంబర్ 12వ తేదీన శిక్షను వెల్లడించనున్నారు.
మహిళపై దాడి చేసిన వారిలో మొత్తం 12 మంది నిందితులు ఉన్నారు. వారిలో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలిపై తీవ్రంగా అటాక్ చేశారు. ఆమె దుస్తులు చిరిగిపోయాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. బాధితురాలికి పార్లమెంటరీ రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎస్-ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1), (ఎక్స్), 4, 354, 148, 149 కింద కేసులు బుక్ చేశారు. ఐపీసీలోని 323, 506, 148, 149 సెక్షన్ల కింద కూడా ముగ్గుర్ని దోషులుగా తేల్చారు. తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేసిన బాధితురాలు.. నిందితులకు భారీ శిక్షను వేయాలని ఆశాభావం వ్యక్తం చేసింది. చాన్నాళ్లు మనోవేదనకు గురయ్యానని, పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త తనకు ఎంతో సహకరించినట్లు ఆ బాధితురాలు చెప్పారు.