Supreme Court | వివాదాస్పద వక్ఫ్ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 15, 21, 25, 26, 29, 30, 300-ఏ ఉల్లంఘనగా ప్రకటిస్తూ బిల్లును రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ బిల్లు ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని.. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను తగ్గిస్తోందన్నారు. ఈ బిల్లు ఏకపక్ష కార్యనిర్వాహక జోక్యాన్ని సులభతరం చేస్తుందని, మతపరమైన, ధార్మిక సంస్థలను నిర్వహించేందుకు మైనారిటీ హక్కులను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
వక్ఫ్ (సవరణ) బిల్లును ఇప్పటికే లోక్సభ, రాజ్యసభ రెండూ ఆమోదించిందిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలువురు నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సైతం బిల్లు చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందిందని.. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) బిల్లును ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపించారు. ఈ బిల్లు రాజ్యాంగంపై స్పష్టమైన దాడిగా పేర్కొన్నారు. మరో వైపు పలువురు నేతలు బిల్లుపై చట్టపరంగా సవాల్ చేస్తామని పేర్కొన్నారు.