న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే.. కాంగ్రెస్ కాదు అని గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్నట్లే గుజరాత్లో ఆప్ జెండా ఎగురవేస్తామని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తామని తేల్చిచెప్పారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని గోపాల్ స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఆప్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గోపాల్ గుర్తు చేశారు. విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అద్భుతమైన స్కూల్ భవనాలు నిర్మించామని తెలిపారు. నిరుపేదల కోసం అధునాతన సదుపాయాలతో దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు. తాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చేశామన్నారు. ఇవే అంశాలను పంజాబ్లో కూడా అమలు చేస్తామన్నారు. పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల హామీలను నెరవేరుస్తామని గోపాల్ స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో గుజరాత్లో తమ పార్టీ పటిష్టత కోసం కార్యక్రమాలు చేపడుతామని గోపాల్ స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాల ద్వారా తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. పంజాబ్లో రైతులకు ఉచిత కరెంట్, తాగునీరు, పంటలకు పూర్తిస్థాయి ధర ఇస్తామని ప్రకటించాం. ఈ మూడింటి కేంద్రంగా చేసుకుని గుజరాత్లో కూడా ప్రచారం నిర్వహిస్తామన్నారు. పరిశ్రమల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని తీసుకువస్తామని గోపాల్ పేర్కొన్నారు.