న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు (Bhagwant Mann) చెందిన ఢిల్లీలోని అధికార నివాసంపై పోలీసుల రైడ్ జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. కపుర్తలా హౌస్‌లోకి వెళ్లేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారని పేర్కొంది. ఢిల్లీ సీఎం అతిషి ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపించారు. ‘ఢిల్లీలోని భగవంత్ మాన్ ఇంటిపై దాడి చేయడానికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. బీజేపీ వ్యక్తులు పట్టపగలే డబ్బులు, బూట్లు, బెడ్ షీట్లను బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు వాటిని గమనించరు. ఎన్నికైన ముఖ్యమంత్రి నివాసంపై దాడిని వారు ఎంచుకుంటారు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఢిల్లీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్న ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అధికారిక నివాసం కపుర్తలా హౌస్‌పై రైడ్ చేయలేదని స్పష్టం చేశారు. సీ విజిల్ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదును దర్యాప్తు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని బృందం అక్కడకు చేరుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించలేదని చెప్పారు.