Labh Singh Ugoke | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం గురించి మాత్రం ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. దానికి కారణం అక్కడ తొలిసారి ఆప్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం. చివరకు పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ కూడా దారుణంగా ఓడిపోయాడు. పంజాబ్‌లో ఇప్పటికే ఆప్ గెలుపు ఖాయం అయిపోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 14 సీట్లను మాత్రమే గెలుచుకుంది.
ఆప్ ఇప్పటి వరకు 77 సీట్లలో గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లలో మాత్రమే గెలిచింది. ఎస్ఏడీ 2 సీట్లు గెలిచింది. అయితే.. పంజాబ్‌లో ఉన్న సీట్లలో ఎక్కువమంది చూపు మాత్రం భదౌర్ నియోజకవర్గం వైపే ఉంది. ఎందుకంటే.. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది ముఖ్యమంత్రి చన్నీ. కానీ.. చన్నీ.. ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ చేతుల్లో ఓడిపోయారు. దీంతో అందరూ ఇప్పుడు లాభ్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఎందుకంటే.. పంజాబ్ ముఖ్యమంత్రిని ఓడించిన లాభ్ సింగ్.. చాలా సాధారణ వ్యక్తి. అతడి తండ్రి ఒక డ్రైవర్, తల్లి స్వీపర్.
2013లో లాభ్ సింగ్.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో తన తల్లి స్వీపర్‌గా పనిచేస్తుందని.. తన తండ్రి డ్రైవర్ అని లాభ్ సింగ్ చెప్పుకొచ్చారు. లాభ్ సింగ్.. కొంతకాలం మొబైల్ రిపేర్ షాప్‌ను కూడా నిర్వహించారు. లాభ్ సింగ్.. 12వ తరగతి వరకు చదివారు.
భదౌర్ నియోజకవర్గంలో మొత్తం 74 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. కానీ.. ముఖ్యమంత్రి చన్నీకి మాత్రం ఇక్కడి ప్రజల సమస్యలేవీ తెలియవు. నాకు అయితే.. భదౌర్ అనేది ఒక నియోజకవర్గం కాదు. నాకు ఫ్యామిలీ. భదౌర్ నియోజకవర్గంలో చన్నీకి కనీసం 10 గ్రామాల పేర్లు కూడా తెలియవు.. అని లాభ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు తెలిపారు.
భదౌర్ నియోజకవర్గం.. బర్నాలా జిల్లా కిందికి వస్తుంది. ఈ జిల్లాలో బర్నాలా, మెహల్ కలాన్, భదౌర్.. మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కిందికి భదౌర్ వస్తుంది. 2017లో భదౌర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ గెలిచినప్పటికీ.. ఆయన గత సంవత్సరమే కాంగ్రెస్‌లో చేరారు.