న్యూఢిల్లీ : ఎయిరిండియా ఏఐ-171 విమానం గత నెలలో అహ్మదాబాద్‌లో కూలిపోవడానికి కారణం దానిలోని రెండు ఇంజిన్లు ఒకే సమయంలో విఫలమవడమేనని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 12న ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరినప్పటి పరిస్థితులను ఎయిరిండియా కృత్రిమంగా సృష్టించింది. దీనినిబట్టి ఈ ప్రమాదానికి విమాన నియంత్రణ సెట్టింగ్స్ ప్రధాన కారణం కాదని తెలిసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వర్గాలు ఓ చానల్‌కు తెలిపిన వివరాల ప్రకారం, ఎమర్జెన్సీ పవర్ సోర్స్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ)ని విమానంలోని రెండు ఇంజిన్లు విఫలమైనపుడు మాత్రమే యాక్టివేట్ చేస్తారు. ఈ విమానం కూలిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు దీనిని యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. దీనిని బట్టి రెండు ఇంజిన్లు విఫలమయ్యాయనే వాదనకు బలం చేకూరుతున్నది. ఈ ప్రమాదానికి కారణం విద్యుత్తు లోపమా? ఇంధనం కల్తీయా? ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ వైఫల్యమా? అనే అంశాలను కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నది.