న్యూఢిల్లీ: దేశ పౌరులకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆధార్‌లోని మీ మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే మార్చుకోవచ్చు. దీని కోసం ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ తెలిపింది. ఇప్పటివరకు ఆధార్‌లోని మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి స్వయంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది.
ఎందుకంటే ఆ వ్యక్తి గుర్తింపు ధ్రువీకరణ, ప్రామాణీకరణ తప్పనిసరిగా చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఆ బాధ ఉండదు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు యూఐడీఏఐ త్వరలో ప్రవేశపెట్టబోయే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ ద్వారా యాప్‌లోకి ప్రవేశించిన తర్వాత ప్రస్తుత, లేదా కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసి స్మార్ట్ ఫోన్ ద్వారా ముఖ గుర్తింపు, ప్రామాణీకరణ పూర్తి చేయాలి. తద్వారా మొబైల్ అప్డేషన్ను సులభంగా పూర్తి చేయవచ్చు.