Love Marriage | చెన్నై : హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ప్రేమ పెళ్లికి తమిళనాడులోని పెరియార్ కళ్యాణ మండపం వేదికైంది. నూతన వధూవరులకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
సేలం జిల్లాలోని తారమంగళం సమీపంలోని ఓమలూర్కు చెందిన శరవణ కుమార్(32) స్థానికంగా ఉన్న ఓ వస్త్ర తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. అదే సంస్థలో సరోవ(30) అనే హిజ్రా పని చేస్తుంది. ఆమెపై కుమార్ మనసు పారేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో హిజ్రా కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాలయంలోని పెరియర్ కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ద్రావిడ కళగం జిల్లా అధ్యక్షుడు న్యాయవాది మునియప్పన్ నేతృత్వం వహించారు. కుమార్, సరోవ ప్రేమ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.