న్యూఢిల్లీ: ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్లో దారుణమైన మర్డర్(Delhi Murder) జరిగింది. ఇంట్లో పనిచేసే వ్యక్తి.. యజమానురాలితో పాటు ఆమె కుమారుడిని హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. 42 ఏళ్ల రుచికా సివాని, ఆమె కుమారుడు 14 ఏళ్ల క్రిష్‌ను గొంతు కోసి చంపాడు. పని మనిషిపై అరిచినందుకు అతను ఇద్దర్నీ హత్య చేసినట్లు తెలుస్తోంది. రుచిక భర్త కుల్దీప్ సవానీ రాత్రి 9.30కు ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపు మూసి ఉండడంతో భార్యను పిలిచాడు. కానీ ఎంత సేపటికి రెస్పాన్స్ రాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. గేటుతో పాటు మెట్ల వద్ద రక్తపు చుక్కలు కనిపించాయి. దీంతో అలర్ట్ అయిన కుల్దీప్.. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు.
భార్య, కుమారుడు మిస్సైనట్లు పేర్కొన్నాడు. ఇంటికి వచ్చిన పోలీసులు తలుపును పగలగొట్టారు. తన మంచం పక్కన రుచిక శవంలా పడి ఉన్నది. షర్ట్‌తో పాటు ఆమె తల వద్ద రకప్తు మరకలు ఉన్నాయి. పదో తరగతి చదువుతున్న క్రిష్.. బాత్రూమ్ ఫ్లోర్లో రక్తపు మడుగులో ఉన్నాడు. లాజ్‌పత్ నగర్‌లోని రుచికకు గార్మెంట్ షాపు ఉన్నది. ఈ కేసులో డ్రైవర్‌గా, హెల్పర్‌గా పనిచేస్తున్న ముకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
సిటీ నుంచి తప్పించుకుంటున్న సమయంలో అతన్ని పట్టుకున్నారు. తనను తిట్టడం వల్లే రుచిక, ఆమె కొడుకును చంపినట్లు ముకేశ్ అంగీకరించాడు. అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు 24 ఏళ్ల ముకేశ్ స్వంత రాష్ట్రం బీహార్. ఢిల్లీలోని అమర్ కాలనీలో అతను ఉంటున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం పంపారు. ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. సమీపంలోని సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు.