లక్నో: పెళ్లైన వారం రోజులకే మూడో భార్యతో కలహాలు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను కొట్టి చంపాడు. (Man Thrashes Third Wife To Death) పొరుగింటి వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమౌలి గ్రామానికి చెందిన 44 ఏళ్ల రాజు పాల్‌కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయి. మొదటి, రెండో భార్యలు అతడ్ని విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మే 9న జౌన్పూర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల ఆర్తిని, రాజు పాల్ మూడో పెళ్లి చేసుకున్నాడు.
కాగా, పెళ్లైన కొన్ని రోజులకే మూడో భార్య ఆర్తి, రాజు మధ్య గొడవలు మొదలయ్యాయి. మే 15న గురువారం రాత్రి వేళ వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మూడో భార్య ఆర్తిని రాజు కొట్టి చంపాడు. ఇది తెలుసుకున్న పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆర్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆర్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడు రాజును అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.