Viral news : అది ఒక ఆడపులి (Tigress). ఏం జరిగిందో ఏమో గానీ దాని నడుము చుట్టూ ఒక ఇనుపరింగు (Megtalic snare) బిగుసుకుని ఉంది. దాని పొట్ట కింది భాగం రింగులో ఇరుక్కుపోవడంతో ఆ పులి రూపే మారిపోయింది. అచ్చం చిరుత (Cheeta) లా దాని రూపు మారింది. నడుముకు ఇనుప రింగు అంత బిగ్గరగా చుట్టుకుని ఉన్నా ఆ ఆడపులి ఏళ్లుగా జీవనం సాగిస్తున్నది. కేవలం బతుకడం మాత్రమే కాదు.. ఓ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది కూడా.
ప్రస్తుతం 16 నెలల వయసున్న ఆ నాలుగు పిల్లలు తల్లి చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నాయి. పైగా అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. నడుముకు ఇనుప రింగు ఇబ్బంది పెడుతున్నా ఆ పులి వేటాడుతూ తన పిల్లలకు ఆహారం కూడా సమకూరుస్తోంది. ప్రస్తుతం తెరాయ్ ఈస్ట్ ఫారెస్ట్ డివిజన్లోని సురాయ్ ఫారెస్ట్ రేంజ్లో ఈ ఆడపులి ఉన్నది. ఈ పులి ముందుగా 2022లో నడుముకు బిగుసుకున్న ఇనుపరింగుతో అడవిలోని కెమెరాలకు చిక్కింది.
దాంతో 2023 డిసెంబర్లో ఆ పులిని పట్టుకుని ఇనుప రింగును తొలగించేందుకు అటవీ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. అప్పుడు ఆ పులి అధికారులను షాక్కు గురిచేసింది. తన కూనను నోట కరుచుకుని వెళ్తే కనిపించింది. దాంతో పులి పిల్లలు చేసిందని గ్రహించిన అధికారులు ఆపరేషన్ను నిలిపేశారు. అయితే నడుముకు రింగు అంత బిగుతుగా ఉన్నా పులి గర్భం దాల్చడం, పిల్లలను కనడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ప్రస్తుతం పులి పిల్లల వయసు 16 నెలలు. ఇప్పటికైనా పులిని పట్టుకుని రింగును తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఆ పులి వెన్నుముక దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎక్కువకాలం రింగు బిగుసుకుని ఉండటం వల్ల క్రమంగా కడుపులోని సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయని అంటున్నారు. అందుకే ఆ పులిని పట్టుకుని రింగును తొలగించేందుకు మరోసారి ఆపరేషన్ చేపట్టబోతున్నారు.