Uttar Pradesh | లక్నో: దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన జడ్జినే పట్టుకునేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ ప్రయత్నించారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే, ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో 2012లో ఓ దొంగతనం జరిగింది. నిందితుడు రాజ్ కుమార్ వురపు పప్పు అనేక నాన్ బెయిలబుల్ వారంట్లను పట్టించుకోలేదు. అరెస్ట్ నుంచి, కోర్టుకు హాజరుకావడం నుంచి తప్పించుకుంటున్నాడు.
అతనిని ప్రకటిత నేరస్థుడిగా తీర్పు చెప్పేందుకు సీఆర్పీసీ సెక్షన్ 82 ప్రకారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నగ్మా ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. అతని కోసం వెతకవలసిన ఎస్ఐ భన్వరిలాల్ జడ్జి నగ్మా ఖాన్ కోసం వెతికారు. ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను నాన్‌బెయిలబుల్ వారంట్గా, జడ్జినే నిందితుడిగా భావించారు. దీనిలో పేర్కొన్న చిరునామాలో నగ్మా ఖాన్ లేరని రాసి, నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ విషయం తెలిసి జడ్జి అవాక్కయ్యారు.