న్యూఢిల్లీ, మే 18: పంట సాగులో రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవ్వటాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఓ విద్యార్థిని వారి కోసం సౌరశక్తితో నడిచే సరికొత్త వాహనాన్ని ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని ఆమైటీ ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న సుహానీ చౌహాన్ ‘సోలార్ పవర్డ్ ఆగ్రో వెహికల్’ (ఎస్వో-ఏపీటీ)ను తయారుచేశారు. సాగు సమయంలో భూమి చదును చేయటం, విత్తనాలు నాటడం, ఇతర పనుల్లో ఈ వాహనం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె వివరించారు. ఢిల్లీ ప్రగతి భవన్లో ఇటీవల జరిగిన టెక్ ప్రదర్శనలో ఈ వాహనం అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌరశక్తితో నడిచే ఈ వాహనం పర్యావరణహితమైందేగాక, నిర్వహణ సున్నా కావటంతో రైతులపై ఆర్థికంగా భారం పడదు. ఐదు నుంచి ఆరేండ్ల వరకు వాహనంలోని బ్యాటరీ పనిచేస్తుండటం మరో విశేషం. పేద రైతులకు ఉపయోగపడాలన్న ఆకాంక్షతో ఆగ్రో వెహికల్‌ను అభివృద్ధి చేసినట్టు సుహానా చెప్పారు.