Bengaluru | బెంగళూరు, సెప్టెంబర్ 16: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో శాంతిభద్రతల డొల్లతనాన్ని ఎత్తిచూపేలా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. ఐటీ నగరం బెంగళూరులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఓ వ్యక్తిని చితకబాదడమే కాకుండా నగ్నంగా వీధుల్లో పరుగెత్తించిన అమానుష ఘటన నగరంలోని కామాక్షిపాల్యలో జరిగింది. గుర్తు తెలియని ఆ వ్యక్తిని రౌడీషీటర్ దారుణంగా కొట్టాడు. బతికి ఉండాలంటే బట్టలిప్పేసి నగ్నంగా పరుగెత్తాలని ఆదేశించడంతో బాధిత వ్యక్తి అలా అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై పరుగులు తీశాడు. అందరూ అతడిని అలా చూస్తూ ఉండిపోయారే తప్ప అతడిని ఆదుకోవడానికి ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేదు.
దీనికి సంబంధించిన వీడియో సోమవారం వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు నిందితుడిని పవన్ గౌడగా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. బట్టలిప్పి నగ్నంగా మారాలంటూ పవన్ అతడిని బెదిరించడం, తనపై దయ చూపాలంటూ బాధితుడు అతడిని వేడుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది. తొలుత బాధితుడు బట్టలు తీసివేసి, తర్వాత వాటిని ధరించాడు. అయితే అలా చేసినందుకు అతడిని ఆ రౌడీషీటర్ కొట్టడమే కాక, నగ్నంగానే ఉండాలని ఆదేశించాడు. ప్రాణాలతో ఉండాలంటే బట్టల్లేకుండా పరుగెత్తాలని పవన్ బెదిరించడంతో బాధితుడు అలాగే చేయక తప్పలేదు. ఈ ఘటన 10 రోజుల క్రితం జరిగినట్టు తెలిసింది. ఈ అమానుష ఘటనతో కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పౌరుల భద్రతపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అయితే ఈ దాడికి కారణాలు తెలియరాలేదు.