సహ జీవనం.. భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తున్న జీవన విధానం. అయితే ఇది కొన్ని సందర్భాల్లో మహిళలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. తోడు నీడగా ఉంటామని బాసలు చేసిన వారే అపార్థాలతో, అనుమానాలతో వారిని కర్కశంగా కడ తేరుస్తున్నారు. సమాజం ఊహించని విధంగా వారిని మానసికంగా, శారీరకంగా ‘చిత్ర వధ’ చేసి చంపుతున్నారు. మొన్న శ్రద్ధావాకర్.. నిన్న హైదరాబాద్ నర్స్… నేడు ముంబైకి చెందిన సరస్వతీ వైద్య.
Live-In Relationship | ముంబై, జూన్ 8: మూడేండ్లుగా సహ జీవనం చేస్తున్న సహచరిని దారుణంగా చంపి ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడో ముంబై వ్యక్తి. బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం గీతా నగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో సరస్వతీ వైద్య(32) అనే మహిళ మనోజ్ సేన్(56) అనే వ్యక్తితో సహ జీవనం చేస్తున్నది. వారు నివసిస్తున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తున్నదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తలుపులు బద్దలు కొట్టి ఫ్లాట్‌ను పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే దృశ్యాలు కనిపించాయి. మూడు బకెట్లలో రక్తంతో నిండిన మాంసపు ముద్దలు, సగం కాలిన ఎముకలు కనిపించాయి. మృతురాలి జుట్టు నేల పైన కనిపించింది. అయితే వీటి వల్ల దుర్వాసన రాకుండా ఉండటానికి నిందితుడు స్ప్రే చల్లాడని ఇరుగు పొరుగు వారు తెలిపారు. దుర్వాసన విషయమై తాను మనోజ్‌తో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు అతడు హడావిడిగా బయటకు వెళ్లాడని, సరస్వతి కొన్ని రోజులుగా కనిపించడం లేదని తన తల్లి గుర్తు చేయడంతో పోలీసులను అప్రమత్తం చేయాల్సి వచ్చిందని పొరుగింట్లో ఉండే శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. మృతురాలు అనాథ అని, నిందితుడు రేషన్ షాపులో పని చేసేవాడని, ఇటీవలే ఉద్యోగం కోల్పోయాడని మహారాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రూపవతె వెల్లడించారు.
ఎప్పుడూ వీధి కుక్కలకు ఆహారం వెయ్యని మనోజ్ కొన్ని రోజులుగా వాటికి ఆహారం పెట్టడాన్ని గమనించామని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని గురువారం కోర్టులో హాజరు పరచగా ఈ నెల 16 వరకు అతడికి రిమాండ్ విధించారు. సరస్వతి హత్య ఈ నెల 4న జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తన సహచరి ఆత్మహత్య చేసుకున్నట్టు నిందితుడు మనోజ్ చెప్తున్నాడు. అయితే ఈ విషయాన్ని నమ్మలేమని, కేసు దర్యాప్తులో అసలు విషయం తెలుస్తుందని ముంబై డీసీపీ జయంత్ తెలిపారు. సరస్వతి మృతిని భయంకరమైన దారుణ ఘటనగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె అభివర్ణించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన శాఖపై దృష్టి పెట్టాలని ఆమె ట్వీట్ చేశారు.
సహ జీవనాల్లో ఇద్దరి మధ్య తలెత్తుతున్న అనుమానాలకు, చిన్న చిన్న గొడవలకు, క్షణికావేశాలకు మహిళలే ఎక్కువగా బలైపోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలు మానవ సంబంధాలపైనా, మనుషుల్లోని సున్నితత్వంపైనా ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ఈ తరహా ఘటనలను నియంత్రించడానికి, ఈ తరహా ఘటనల్లో నేరస్థులను శిక్షించడానికి కఠిన చట్టాలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాయి.