ఫరీదాబాద్: అదనపు కట్నం కోసం కోడలిని చిత్ర హింసలకు గురిచేసిన అత్తమామలు చివరికి ఆమెను చంపి ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన తానుకుమార్కి, ఫరీదాబాద్‌కు చెందిన అరుణ్‌సింగ్‌తో రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని రోజుల నుంచే తానుకుమార్కి వేధింపులు మొదలయ్యాయి. దీంతో తానుకుమార్ పుట్టింటికి వచ్చేసింది.
ఆ తర్వాత పెద్దల జోక్యంతో ఏడాది క్రితం తిరిగి భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం తానుకుమార్ పరారైందని, ఆమెకు మానసిక వ్యాధితో బాధపడుతోందని ఆమె అత్తమామలు ప్రచారం చేశారు. ఆమె అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన తానుకుమార్ తండ్రి హకీమ్ ఫిరోదాబాద్లోని కుమార్తె ఇంటికి వెళ్లాడు.
ఈ క్రమంలో ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి పూడ్చినట్టు ఉండటంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి న పోలీసులు శుక్రవారం జేసీబీతో గొయ్యిని తవ్వించగా 10 అడుగుల లోతున తానుకుమార్ మృతదేహం బయటపడింది. బాధితురాలి భర్త అరుణ్సింగ్తోపాటు ఆమె అత్తమామలు, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.