త్రిస్సూర్: కేరళలోని సెంట్రల్ త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందగా… గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఘటన సమయంలో 40 మంది అక్కడ ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. త్రిస్సూర్ పూరం పర్వదినం కోసం ఒక ఆలయానికి అవసరమైన బాణసంచాను తాత్కాలిక షెడ్లో తయారు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
పేలుళ్ల శబ్దం కిలోమీటర్ల మేర వినిపించిందని.. ఈ ప్రమాదంలో చుట్టు పక్కల ఇండ్లు దెబ్బ తిన్నాయని స్థానికులు తెలిపారు. పేలుళ్లు ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉం డటం ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించడంలో స్థానికులు సహాయ పడ్డారు. ఖాళీగా ఉన్న వ్యవసాయ పొలాల్లో ఇటీవల తాత్కాలిక బాణసంచా తయారీ యూనిట్లను నెలకొల్పుతున్నట్టు అధికారులు గుర్తించారు.