బెంగుళూరు: బెంగుళూరు(Bengaluru)లో ఓ వ్యక్తి ఓ మహిళ నుంచి 17 లక్షలు వసూల్ చేశాడు. ప్రైవేటు వీడియోలను లీక్ చేస్తానని బెదిరించి ఆ మొత్తాన్ని ఆమె వద్ద నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని స్వరూప్ గౌడగా గుర్తించారు. అయితే 2022లో ఫేస్బుక్ ద్వారా 32 ఏళ్ల మహిళకు, అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్లు ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తరుచుగా కలుసుకున్నారు. తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లు చెప్పిన గౌడ కొంత సహాయాన్ని కోరాడు. అతని నమ్మిన ఆ మహిళ ముందుగా 4.42 లక్షలు ఇచ్చింది.
కానీ ఆ తర్వాత కూడా పదేపదే డబ్బులు అడగడం మొదలుపెట్టాడతను. ప్రైవేటు వీడియోలను ఆన్లైన్లో లీక్ చేస్తానని చెప్పి బెదిరించాడు. దీంతో ఆమె భయానికి లోనైన మళ్లీ 12.82 లక్షలు సమర్పించినట్లు తెలిసింది. ఆ డబ్బులు వాపస్ ఇవ్వాలని ఆ మహిళ డిమాండ్ చేయగా, బాధితురాలి ఫోన్ కాల్స్‌కు గౌడ స్పందించలేదు. సున్కదకట్టె బస్సు స్టాప్ వద్ద తనను గౌడ కొట్టినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది.
గౌడకు చెందిన సన్నిహితులు ఆ మహిళకు రెండు లక్షల సెటిల్మెంట్ ఆఫర్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. వేధింపులు, చీటింగ్, బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. తన డబ్బును రికవరీ చేసి ఇవ్వాలని కోరింది. గౌడపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.