Murder | పద్నాలుగేండ్ల విలువైన జీవితాన్ని జైల్లో గడిపేసి వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. యావజ్జీవ శిక్ష అనుభవించినా అతనిలో ఆవేశంతో పోలేదు. కేవలం 200 రూపాయల కోసం జరిగిన గొడవలో తోటి కూలీని క్రూరంగా హత్య చేశాడు. కర్ణాటకలోని కార్వర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కమటగేరికి చెందిన మంజునాథ్ బజయ్య చెన్నయ్య 2002లో తన మామను చంపిన కేసులో జైలుకెళ్లాడు. యావజ్జీవ శిక్ష అనుభవించి 2016లో విడుదలయ్యాడు. అప్పట్నుంచి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రవీశ్ గణపతి చెన్నయ్య(35)తో అతనికి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి కూలీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరూ మద్యం సేవించి, కమటగేరి వదిరాజ్ మఠం దగ్గర ఉన్న మంజునాథ్ ఇంటి వద్దకు వచ్చారు. అప్పుడే వారి మధ్య కూలీ డబ్బుల కోసం గొడవ జరిగింది.
మంజునాథ్‌కు రూ.500 కూలీ డబ్బులు రావాల్సి ఉంది.. కానీ రవీశ్ గణపతి రూ.300 మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.200 ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. ఇదే విషయమై రవీశ్‌తో మంజునాథ్ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన మంజునాథ్ తన దగ్గర ఉన్న కొడవలితో రవీశ్ తలపై గట్టిగా వేటు వేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన రవీశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రవీశ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిర్సి రూరల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.