బెంగళూరు: హెల్మెట్ లేకుండా బైకు నడిపినందుకు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి అక్కడి ట్రాఫిక్ పోలీసులు చలానా పంపించారు. ఆ చలానాతో పోలీసులు అటాచ్ చేసిన ఫొటోలో అతని స్కూటీ, స్కూటీ నంబర్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అతను తలకు హెల్మెట్ ధరించాడా..? లేదా..? అనేది ఆ ఫొటోలో కనిపించడంలేదు.
దాంతో అతను.. తాను హెల్మెట్ ధరించలేదనడానికి ప్రూఫ్ కావాలని బెంగళూరు పోలీసులను సవాల్ చేశాడు. గతంలో కూడా ఇలాగే చలానా వేస్తే ప్రశ్నించకుండా చెల్లించానని, ఇప్పుడు మాత్రం తాను హెల్మెట్ ధరించనట్లుగా ప్రూఫ్ చూపిస్తే తప్ప చలానే కట్టేది లేదని అతని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు, బెంగళూరు సిటీ పోలీసులకు ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే ప్రూఫ్ చూపించారు. అతను హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్నట్లుగా ఉన్న ఫుల్ ఫొటోను చలానాకు జతచేశారు. దాంతో బైకర్ సంతృప్తి చెందాడు. వెంటనే రిప్లై ఇచ్చిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రూఫ్ ఇచ్చినందున చలానా కడుతానని పేర్కొన్నాడు.