మహారాష్ట్రంలోని పూణె సమీపంలోని ఓ గ్రామంలో 45 అడుగుల లోతున్న బావిలో మగ చిరుతపులి పడిపోయింది. అది నీటిలో మునిగిపోతూ గట్టిగా గాండ్రించింది. పులి గర్జన విన్న గ్రామస్తులు మొదట బయపడ్డారు. అనంతరం ఆ భయంకరమైన గాండ్రింపు బావిలోనుంచి వస్తుందని తెలుసుకొని, అందులో తొంగి చూడగా, పులి మునిగిపోతున్నది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు మహారాష్ట్ర అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ, వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ను అప్రమత్తం చేశారు.
చిరుతపులి పడ్డ బావి ఓటూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బెల్హే గ్రామం కిందకు వస్తుంది. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. మంచానికి నాలుగువైపులా తాళ్లు కట్టి బావిలోకి వదిలారు. చిరుతపులి ఆ మంచంపైకి ఎక్కగా, పైకి లాగారు. అనంతరం దాన్ని వైద్య పరీక్షల కోసం మానిక్దో కేంద్రానికి తరలించారు. పశువైద్య బృందం ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించడంతో, చిరుతపులిని సోమవారం తిరిగి దాని సహజ ఆవాసంలోకి వదిలిపెట్టారు.