హైదరాబాద్, నవంబర్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ కోడ్లను తీసుకొచ్చారని మండిపడుతున్నారు. కంపెనీల మూసివేత, ఉద్యోగాల కోత, సమ్మె, కనీస వేతనంలో స్పష్టత ఇలా కీలక విషయాల్లో కార్పొరేట్లకు అనుకూల వైఖరిని ప్రదర్శించారని కార్మిక సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 ప్రకారం.. 300 మంది వరకు సిబ్బంది లేదా కార్మికులు ఉన్న కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు, కంపెనీల మూసివేతకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకూ 100 మంది వరకు సిబ్బంది కలిగిన కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. దీన్ని ఇప్పుడు 300కు పెంచారు. ఒకవేళ, అధికారులు కంపెనీ మూసివేత విజ్ఞప్తికి స్పందించని పక్షంలో, మూసివేత ప్రతిపాదనకు ఆమోదంలాగానే పరిగణిస్తారు. రాష్ర్టాలు ఈ 300 పరిమితిని పెంచుకొనే వెసులుబాటు కూడా ఇచ్చారు. ఈ నిర్ణయంతో కార్పొరేట్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు కంపెనీలను మూసివేయడానికి కేంద్రం రాచమార్గాన్ని ఏర్పాటు చేసినట్లయ్యిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
వేతనాల కోడ్, 2019 ప్రకారం.. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కనీస వేతనం పొందేందుకు అవసరమైన సూత్రాలను పొందుపరిచినప్పటికీ, ఆ వేతనం ఎంత? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. నెలకు రూ. 26 వేలను కనీస వేతనంగా నిర్ణయించాలన్న కార్మిక సంఘాల విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాంతం, కుటుంబ అవసరాలను బట్టి ప్రభుత్వ సూచనల మేరకు కనీస వేతనాన్ని నిర్ణయించాలని, అందులోనూ కంపెనీల అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇచ్చేలా చట్టాన్ని తేవడంపై కార్మిక లోకం భగ్గుమంటున్నది.
కార్మికుల సమ్మెకు సంబంధించి పారిశ్రామిక సంబంధాల కోడ్లో కొత్త నిబంధనలు పొందుపరిచారు. ఈ రూల్స్ ప్రకారం.. సమ్మె చేయాలంటే యూనియన్లు 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆకస్మిక నిరసనలను నియంత్రించడమేనని, ప్రశ్నించే కార్మికుల గొంతుకను నొక్కేయడమేనని కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. యాజమాన్యం ఏకపక్ష విధానాలను ఎండగట్టేందుకు ఉద్దేశించిన సామూహిక సెలవులను కూడా నిరోధించేలా ఈ కోడ్లో నిబంధనలు పెట్టడంపై ధ్వజమెత్తారు.
కార్మికుల విషయంలో కంపెనీలు చేసే నేరాలకు ఇప్పటివరకూ ఉన్న జైలు శిక్ష స్థానంలో జరిమానాలతో కేంద్రం సరిపెట్టిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మికులకు ఇవ్వాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలపై స్పష్టమైన విధివిధానాలను ఏమాత్రం చెప్పలేదని ఆరోపిస్తున్నాయి. 51% సభ్యత్వం పేరిట ట్రేడ్ యూనియన్లను బలహీనపర్చేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్టు మండిపడుతున్నాయి.
కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లలో డొమెస్టిక్ వర్కర్లు, హోమ్-బేస్డ్ వర్కర్లు, వ్యవసాయాధారిత కూలీల గురించి ప్రస్తావించలేదని కార్మిక నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే నిర్మాణరంగ, మైనింగ్, బ్లాస్టింగ్ రంగాల్లోని కార్మికులను కూడా విస్మరించారని మండిపడుతున్నారు. పని ప్రాంతాల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై కూడా ఈ కోడ్లలో స్పష్టమైన విధివిధానాలు పొందుపరుచలేదని ధ్వజమెత్తుతున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) నిబంధనల ప్రకారం.. కార్మిక చట్టాలను రూపొందించాలంటే ప్రభుత్వ పెద్దలు, యాజమాన్యాలు, కార్మిక సంఘాల నేతలందరూ కలిసి ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందని, అయితే అన్నివర్గాలతో సంప్రదింపులు చేపట్టకుండానే కేంద్రం ఈ కోడ్లను తెచ్చిందని మండిపడ్డారు.
రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న కార్మికుల ప్రయోజనాలు అనే అంశంపై వివిధ రాష్ర్టాలు 100 వరకూ చట్టాలు చేయగా, కేంద్రం చేసిన చట్టాలు 40 వరకూ ఉన్నాయి. 2002లో ఏర్పాటు చేసిన రెండో జాతీయ లేబర్ కమిషన్ ఈ చట్టాలన్నింటినీ సమీకృతపర్చి సరళమైన కొన్ని చట్టాలుగా మార్చాలని సూచించింది. దీంతో కేంద్రం 29 చట్టాలను కలిపి 2019లో 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఇందులో ఒకటైన వేతనాల కోడ్ను 2019లో పార్లమెంట్ ఆమోదించగా, మిగతా మూడు కోడ్లకు 2020లో ఆమోదం లభించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై 2020లో పార్లమెంట్లో గొడవ జరుగుతున్న సమయంలో.. ఎంపీల బహిష్కరణ, విపక్షాల వాకౌట్ సమయంలో ఈ కోడ్లకు ఆమోదం లభించడం గమనార్హం.