Viral news : అక్కడ అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది..! పెళ్లికూతురు, పెళ్లి కొడుకు వేదికపై పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నారు..! ఇరువురి కుటుంబాల సమక్షంలో పెళ్లి తంతు కొనసాగుతోంది..! బంధుమిత్రులంతా వేదిక ముందు ఆసీనులై పెళ్లి వేడుకను వీక్షిస్తున్నారు..! అంతా సజావుగా సాగుతున్న సమయంలో పెళ్లి కొడుకు చేసిన పని ఆ పెళ్లి రద్దుకు దారితీసింది. దేశ రాజధాని ఢిల్లీలోని సాహిబాబాద్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులిద్దరూ వేదికపైకి వచ్చారు. ఒకరికొకరు పూలదండలు వేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లిపీటల మీద ఆసీనులపై పురోహితుడి సూచనల ప్రకారం పెళ్లి తంతును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు వాష్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగొచ్చి కాసేపటికి మళ్లీ వాష్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీమళ్లీ అలాగే వెళ్తుండటంతో పెళ్లి కూతురుకు అనుమానం వచ్చింది.
మాటిమాటికి వాష్‌రూమ్‌కు ఎందుకు వెళ్తున్నాడో కనిపెట్టండి అంటూ తన కుటుంబీకులకు కనుసైగ చేసింది. దాంతో పెళ్లికొడుకు చేస్తున్న పని తెలుసుకుని వధవు కుటుంబీకులు ఖంగుతిన్నారు. వాష్‌రూమ్ పేరు చెప్పి పెళ్లి కొడుకు వేదిక వెనుకాల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతడిని తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. వరుడు మెడలో వేసిన పూలమాలను విసిరికొట్టింది.
దాంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు దూషించుకోవడమేగాక కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. పెళ్లి రద్దయిపోయింది. శుభమా అంటూ పెళ్లి జరుగుతున్న వేళ పెళ్లికొడుకు చేసిన పిచ్చిపని తీవ్ర గందరగోళానికి దారితీసింది. పీటల మీదే పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది.