Delhi girl : డ్రైవర్ గొడవ పెట్టుకోవడంతో భయపడిపోయిన ఓ బాలిక రన్నింగ్ బస్సులోంచి కిందకు దూకింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు డ్రైవర్ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం సాయంత్రం ఓ మైనర్ బాలిక ఇబ్రహీంపూర్ చౌక్ ఏరియాలో బస్సు ఎక్కింది. ఆ తర్వాత కాసేపటికే డ్రైవర్ దీపక్, అతని స్నేహితుడు మనోజ్ ఆమెతో వాగ్వాదానికి దిగారు. దాంతో భయపోడిపోయిన బాలిక బురారీలోని నాథ్పురా ఏరియాలో బస్సు స్పీడ్ కొద్దిగా నెమ్మదించగానే కిందకు దూకేసింది.
స్థానికులు వెంబడించి షాలిమార్ ప్యాలెస్ చౌక్ ఏరియాలో డ్రైవర్ను, అతడి స్నేహితుడిని పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ముందుగా పోలీసులు నిందితులిద్దరినీ, బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, బాలికపై డ్రైవర్, అతడి స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడి ఉంటాడని ముందుగా వార్తలు వినిపించినా ఆ వార్తలను బాధితురాలు కొట్టిపారేసింది. లైంగికంగా వేధించలేదని గొడవపెట్టుకున్నారని, బస్సు ఆపకుండా తీసుకెళ్తుండగా దూకేశానని చెప్పింది.