Bengal Exit polls : పశ్చిమబెంగాల్ (West Bengal) లో అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అధికార పీఠం ఆ రెండు పార్టీల మధ్య దోబూచులాడనుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని సర్వేల సంస్థలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే మళ్లీ విజయమని స్పష్టం చేస్తుంటే.. మరికొన్ని సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలుపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేటితో ముగిసింది. పశ్చిమబెంగాల్లో రెండు విడతల్లో మిగతా అన్ని చోట్ల ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఇవాళ బెంగాల్లో రెండో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియకు పూర్తిగా తెరపడింది. ఈ క్రమంలో జాతీయ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనాలను విడుదల చేశాయి.
పశ్చిమ బెంగాల్లో అధికారం మళ్లీ టీఎంసీదేనని పీపుల్స్ పల్స్, ఏబీపీ-సీ ఓటర్, ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు టీఎంసీ కాదు, బీజేపీనే అధికారంలోకి రాబోతున్నదని మ్యాట్రిజ్, పీ-మార్క్, రిపబ్లిక్ – జన్ కీ బాత్ సర్వే సంస్థల అంచనాలు స్పష్టంచేశాయి. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొందని తెలిపింది. సర్వే సంస్థలు బెంగాల్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో విజయం ఎవరిని వరిస్తుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఉత్కంఠ ఫలితాలు వెల్లడయ్యే మే 4వ తేదీ వరకు కొనసాగనుంది.
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనాల ప్రకారం.. బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగాను తృణమూల్ కూటమి 177-187 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ప్రతిపక్ష బీజేపీ 95-110 స్థానాలు గెలిచి గతం కంటే మెరుగుపడనుంది. కానీ మళ్లీ ప్రతిపక్షంగానే ఉంటుంది. మ్యాట్రిజ్ సంస్థ సర్వే అంచనాలు మాత్రం విజయం బీజేపీదే అని స్పష్టం చేసింది. బీజేపీ 146-161 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుంది. తృణమూల్ కూటమి 125-140 స్థానాలు దక్కించుకుని స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోతుంది.
ఇక పీ-మార్క్ సర్వే సంస్థ అంచనాలు కూడా విజయం ప్రతిపక్ష బీజేపీదేనని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ 150-175 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. టీఎంసీ కూటమి 118-138 స్థానాలతో మెజారిటీని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుంటుంది. ఏబీపీ-సీ ఓటర్ సర్వే మాత్రం అధికారం మళ్లీ టీఎంసీదే అని స్పష్టం చేసింది. టీఎంసీ 152–164 స్థానాలు దక్కించుకుని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందని తెలిపింది. బీజేపీ 109–121 మాత్రమే గెలిచి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని పేర్కొన్నది.
ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ మాత్రం రెండు పార్టీల మధ్య విజయం ఎవరిని వరిస్తుందో కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నది. బీజేపీకి 134–160 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అధికార టీఎంసీకి 130–156 స్థానాలు దక్కే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. రిపబ్లిక్ – జన్ కీ బాత్ సర్వే బీజేపీదే అధికారమని తెలిపింది. బీజేపీకి 162–185 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నదని, టీఎంసీ మాత్రం కేవలం 104–121 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షంగా ఉంటుందని అంచనా వేసింది. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సర్వే మాత్రం మళ్లీ టీఎంసీదే విజయమని స్పష్టం చేసింది. టీఎంసీ 156 స్థానాలు గెలిచి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనావేసింది. బీజేపీ గతం కంటే ఎక్కువగా అంటే 121 స్థానాలు గెలుస్తుందని తెలిపింది.