న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పెరిగే హెచ్-1బీ వీసాల ఫీజు.. భారత్లోకి వచ్చే రెమిటెన్స్(విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తం) భారీ ఎత్తున తగ్గించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఏటా స్వదేశానికి పెద్ద మొత్తాల్లో నగదును పంపిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇలా వచ్చిన మొత్తం 135.46 బిలియన్ డాలర్లు. ఇందులో అమెరికా వాటానే 28-30 శాతంగా ఉండటం గమనార్హం. ఇకపై తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు.
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు 5వేల డాలర్లలోపే ఉన్నది. దీంతో ఇకపై ఆ వీసా ద్వారా ఉద్యోగులను అమెరికాకు పంపాలంటే భారత్లోని ఐటీ సహా, ఇతర అన్ని రంగాల సంస్థలకు తలకు మించిన భారమే కానున్నది. అత్యవసరమైతే తప్ప ఉద్యోగులను అమెరికాకు పంపవు. అదికూడా అతికొద్ది మందికే అవకాశం ఉంటుంది. అటు వీసా ఫీజులు, ఇటు అత్యధిక జీతాలు మోయలేని పరిస్థితి.
దీంతో అమెరికా అవసరాలకు స్థానిక వనరులను ఉపయోగించుకోవడానికే మెజారిటీ సంస్థలు మొగ్గుచూపుతాయి. దాంతో అమెరికాలో ఇప్పుడున్న ఉద్యోగులంతా కూడా వీసా గడువు ముగియగానే భారత్కు అంతా సర్దుకుని రావాల్సిందే. ఈ లెక్కన వారి ద్వారా ఇన్నాళ్లూ వస్తున్న రెమిటెన్స్లు ఇక ఆగినట్టేనని చెప్పక తప్పదు. అదే జరిగితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం, స్టాక్ మార్కెట్లు. బ్యాంక్ డిపాజిట్లు, ఇతర సెక్యూరిటీలపై కూడా ప్రభావం పడుతుంది.