చెన్నై: తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ దేవరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసే అయ్యంగార్ల రెండు వర్గాల మధ్య 200 ఏండ్ల నుంచి జరుగుతున్న పోరాటం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. వివాదంలో ఉన్న ఇరు వర్గాలు శ్రీవైష్ణవులే. అయితే వీరిలో ఒకరైన తెంకలాయ్ వారిది దక్షిణాది సంప్రదాయం కాగా, రెండోవారైన వడకలాయ్ వారిది ఉత్తరాది సంప్రదాయం.
ఈ రెండు వర్గాలూ అయ్యంగార్లే. వీరు శ్రీ రామానుజాచార్యుల సంప్రదాయాలనే పాటిస్తారు. ఇరువురూ ఒకే భగవంతుడిని కొలుస్తారు. శ్రీ దేవరాజ స్వామి వారి సమక్షంలో ముందుగా తాము మంత్రోచ్ఛారణ చేయాలని ఇరు వర్గాలు పట్టుబడుతున్నాయి. మద్రాస్ హైకోర్టు నిరుడు నవంబర్‌లో తెంకలాయ్ వర్గానికి హక్కులు కల్పించింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది.