ముంబై: మహారాష్ట్రలో కొత్తగా 9,170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య శుక్రవారం కంటే 13 శాతం ఎక్కువ. ఒక్క ముంబైలోనే 6,347 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,225కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు కరోనాతో మరణించారు. కొత్తగా ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 460కి పెరిగింది. పది మంది మంత్రులతోపాటు 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మరోవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించవచ్చన్న టాక్ వినిపిస్తున్నది. అయితే ప్రస్తుతం దీనిపై చర్చ జరుగలేదని ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే శనివారం తెలిపారు. కేసుల పాజిటివిటీ రేటు, హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ, ఆక్సిజన్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రోజువారీ వైద్య ఆక్సిజన్ అవసరం 700 మెట్రిక్ టన్నులు దాటితే అప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్‌గా లాక్డౌన్లోకి వెళ్తుందని అన్నారు.