మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 15:37:39

ఎరువుల స‌బ్సిడీకి 65వేల కోట్లు.. కోవిడ్ వ్యాక్సిన్‌కు 900 కోట్లు

ఎరువుల స‌బ్సిడీకి 65వేల కోట్లు.. కోవిడ్ వ్యాక్సిన్‌కు 900 కోట్లు

హైద‌రాబాద్‌:  సుమారు 65 వేల కోట్ల మొత్తాన్ని ఎరువుల స‌బ్సిడీకి వినియోగించ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ .. ఎరువుల స‌బ్సిడీ వ‌ల్ల సుమారు 14 కోట్ల మంది రైతులు లాభ‌ప‌డ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.  దేశ‌వ్యాప్తంగా 17.8 శాతం మేర ఎరువుల వినియోగం పెరిగింద‌న్నారు. అనుకూల‌మైన రుతుప‌వ‌నాల వ‌ల్ల‌.. దేశ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింద‌న్నారు. 2016-17లో 488 ల‌క్ష‌ల‌ మెట్రిక్ ట‌న్నుల ఎరువుల‌ను వాడార‌ని, 2020-21 కాల‌ప‌రిమితికి ఆ వినియోగం 673 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు చేరుకోనున్న‌ట్లు మంత్రి చెప్పారు. రాబోయే సీజ‌న్‌లో రైతులంద‌రికీ స‌రైన స‌మ‌యంలో స‌బ్సిడీ అందించేందుకు 65 వేల కోట్లు కేటాయించిన‌ట్లు ఆమె తెలిపారు. 

ఈ వార్షిక సంవ‌త్స‌రానికి.. పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ యోజ‌న స్కీమ్‌కు అద‌నంగా ప‌దివేల కోట్లు కేటాయించ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు.  ఐడియాస్ స్కీమ్ కోసం 3000 కోట్లు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.  కోవిడ్ వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌, అభివృద్ధి కోసం బ‌యోటెక్నాల‌జీ శాఖ‌కు సుమారు 900 కోట్లు కేటాయించ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు.  క్యాపిట‌ల్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ఎక్స్‌పెండిచ‌ర్ కోసం అద‌నంగా 10,200 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయిస్తున్నారు.  స్వ‌దేశీ ర‌క్ష‌ణ ఉత్ప‌త్తులు, గ్రీన్ ఎన‌ర్జీ, ప‌రిశ్ర‌మ ప్రోత్సాహ‌కాల కింద ఆ మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తారు.  ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్-3 కింద ఇవాళ 12 ప్ర‌క‌ట‌న‌లు చేశామ‌ని, వాటి మొత్తం సుమారు 2.65 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని మంత్రి సీతారామ‌న్ తెలిపారు.