న్యూఢిల్లీ: వేతన జీవుల సొంతింటి కల సాకారం కావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నిబంధనలను సడలించింది. ఈపీఎఫ్ సంస్థ సభ్యులు ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా ఈఎంఐ చెల్లింపు కోసం ఇకపై తమ పీఎఫ్ కార్పస్‌లో 90 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఖాతాను తెరిచిన తేదీ నుంచి మూడేళ్లు పూర్తయిన సభ్యులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఐదేళ్లు పూర్తయినవారు మాత్రమే దీనికి అర్హులు. గతంలో ఇంటి కోసం పీఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనల ప్రకారం, ఉద్యోగి, యాజమాన్యం కంట్రిబ్యూషన్లు, వాటిపై వడ్డీ కలిపిన మొత్తం సొమ్ములో 36 నెలల సొమ్మును మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. గృహ నిర్మాణ పథకాల్లో చేరిన సభ్యులకు ఈ అవకాశం ఉండేది కాదు.