సోమవారం 01 జూన్ 2020
National - May 16, 2020 , 10:35:16

నిండు గర్భిణి 900 కి.మీ. నడిచి పండంటి బిడ్డకు జన్మ

నిండు గర్భిణి 900 కి.మీ. నడిచి పండంటి బిడ్డకు జన్మ

పాట్నా : ఓ నిండు గర్భిణి 900 కిలోమీటర్లు నడిచిన తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన యూపీ - బీహార్‌ సరిహద్దులోని గోపాల్‌గంజ్‌ వద్ద గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బీహార్‌లోని సౌపల్‌ గ్రామానికి చెందిన సందీప్‌ యాదవ్‌(32), రేఖాదేవీ(28) దంపతులతో పాటు వారి బంధువులు గ్రేటర్‌ నోయిడాకు వలస వెళ్లారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో వారు తమ సొంతూరికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. సందీప్‌, రేఖాదేవీ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం. కాగా రేఖాదేవీ ప్రస్తుతం 9 నెలల గర్భిణి. 

అయినప్పటికీ గర్భిణితో పాటు సందీప్‌, ముగ్గురు పిల్లలు, బంధువులు కలిసి గ్రేటర్‌ నోయిడా నుంచి గత సోమవారం.. సొంత గ్రామం సౌపల్‌కు బయల్దేరారు. 900 కిలోమీటర్లు నడిచిన అనంతరం ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. బీహార్‌ - యూపీ సరిహద్దులోని గోపాల్‌గంజ్‌ వద్ద అంబులెన్స్‌ సహాయంతో గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు చికిత్సకు నిరాకరించారు.

దీంతో సందీప్‌ అక్కడున్న ఉన్నతాధికారులను సంప్రదించడంతో.. వారి ఆదేశాల మేరకు రేఖాదేవీకి వైద్యులు పురుడు పోశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే వారికి ఓ ట్రక్కు డ్రైవర్‌ లిఫ్ట్‌ ఇచ్చాడు. మిగతా దూరమంతా కాలినడకనే కొనసాగింది. 

గోపాల్‌ గంజ్‌ నుంచి సౌపల్‌కు వెళ్లాలంటే మరో 300 కిలోమీటర్లు నడవాల్సిందే. అయితే రేఖాదేవీ ఆరోగ్యం కోలుకున్న తర్వాత, వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించి సొంతూరికి పంపుతామని గోపాల్‌గంజ్‌ ఎస్పీ మనోజ్‌ కుమార్‌ తివారీ చెప్పారు. మొత్తానికి భార్యకు సుఖప్రసవం జరగడంతో.. సందీప్‌ సంతోషం వ్యక్తం చేశారు.logo