అహ్మదాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లో సోదా చేశారు. రూ.80 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, లగ్జరీ వాచీలు చూసి కంగుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. (gold bars, luxury watches in flat) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి 17న పాల్డి ప్రాంతంలో లాక్ వేసి ఉన్న ఒక నివాసిత ఫ్లాట్‌లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులతో కలిసి డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 88 కేజీల బరువున్న బంగారు కడ్డీలు, విలువైన వజ్రాలతో కూడిన 19.66 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కాగా, స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలపై విదేశీ గుర్తులు ఉన్నాయని డీఆర్ఐ అధికారులు తెలిపారు. దీంతో దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు అనుమానిస్తున్నారు. వజ్రాలు పొదిగిన పాటెక్ ఫిలిప్ వాచ్, జాకబ్ అండ్ కో టైమ్‌పీస్, ఫ్రాంక్ ముల్లర్ వాచ్‌తో సహా 11 లగ్జరీ వాచీలు కూడా సోదాల్లో బయటపడినట్లు అధికారులు చెప్పారు. అలాగే రూ.1.37 కోట్ల నగదు కూడా ఆ ఫ్లాట్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గుజరాత్‌లోని ఫ్లాట్‌లో రూ.80 కోట్ల విలువైన బంగారు కడ్డీలు, నగలు, లగ్జరీ వాచీలు బయటపడటం సంచలనం రేపింది. అయితే ఈ ఫ్లాట్ ఎవరిది అన్న వివరాలు తెలియలేదు.